రాజ్యసభకు చిరంజీవి

రాజ్యసభకు చిరంజీవి?

మెగాస్టార్‌, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కల్పించే విషయంపై అధికార వైసిపి యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఇప్పటికే ఒక స్థాయిలో చిరంజీవికి, వైసిపి ముఖ్య నాయకులకు మధ్య చర్చలు జరిగాయని సమాచారం. జనసేన పార్టీ అధినేత, చిరంజీవి సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, ఆయనకు రాజకీయంగా చెక్‌ పెట్టేందుకే వైసిపి చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనకు తెరతీసిందని అధికారపార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చిస్తున్నాయి. మరోవైపు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కేంద్రంలోని బిజెపి పెద్దలు వైసిపికి సిఫారసు చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 9వ తేదీతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు రిటైరవుతున్నారు. ఆ నాలుగు ఖాళీల భర్తీ కోసం ఈ నెలాఖరులోకానీ, వచ్చే నెల మొదటి వారంలోకానీ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి కేటాయించిన టిఆర్‌ఎస్‌కు చెందిన కె కేశవరావు, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్‌ అలీఖాన్‌, టి సుబ్బరామిరెడ్డి, టిడిపి ఎంపి తోట సీతామహాలక్ష్మి ఈ ఏప్రిల్‌లో పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో నాలుగు ఖాళీల భర్తీ ముందుకొచ్చింది.