రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు.. చిన్నారి ప్రాణాలు కాపాడిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ చిన్నారి ప్రాణం కాపాడి ఉదారత చాటుకున్నారు. తెర మీదే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నెలరోజుల శిశువుకు ఉచితంగా ఆపరేషన్ చేయించారు. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో ఓ పాప పుట్టింది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది.

రోజులు గుడుస్తుంటే పాప ఆరోగ్య పరిస్థితి దెబ్బ తింటుండటంతో ఆమె తల్లిదండ్రులు ప్రదీప్, నాగజ్యోతి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప ఆరోగ్య పరిస్థితి గమనించిన వైద్యులు.. వెంటనే ఆమెకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించాలని, బాగా ఖర్చవుతుందని చెప్పారు. దీంతో అంత ఆర్ధిక స్తోమత లేని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ టీమ్.. వెంటనే రంగంలోకి దిగి మహేష్ బాబు ట్రస్టు ద్వారా ఉచితంగా ఆపరేషన్ పూర్తిచేశారు. ఆంధ్ర ఆస్పత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌‌లో ఈ ఆపరేషన్ జరిగింది. దీంతో తమ బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన హీరో మహేష్‌బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు.