రెండోరోజూ పీఆర్‌సీపై జగన్‌ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ,ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం జగన్‌ వరుసగా రెండో రోజూ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గన్నారు. గురువారం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను వారు సీఎంకు వివరించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌తో సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం రెండు గంటలపాటు చర్చించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఎంత శాతం ఇవ్వాలి, సీపిఎస్‌ రద్దు, కాంట్రక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలపైనా సీఎం చర్చించారు. ఫిట్‌మెంట్‌, ఇతర డిమాండ్ల అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించి ఫిట్‌మెంట్‌ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపైన కూడా సోమవారం సీఎం స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలున్నాయి.