రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో నిబంధనలు కఠినం

రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో నిబంధనలు కఠినం

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రమాదం చాలా భాగం తగ్గిందని, స్థిరమైన అప్రమత్తత పాటించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి, ముందస్తు ప్రణాళిక గురించి చర్చించడం కోసం రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ సానుకూల ఫలితాలను ఇచ్చిందనిన్నారు. మార్చి ప్రారంభంలో భారతదేశంతో సహా చాలా దేశాల్లో పరిస్థితి చాలా భాగం ఒకే విధంగా ఉందని, సకాలంలో తీసుకున్న చర్యల వల్ల దేశం చాలామంది ప్రజల ప్రాణాలను రక్షించగలిగిందని పేర్కొన్నారు. వచ్చే నెలల్లో కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతుందని నిపుణులు చెబుతున్నారన్నారు. ”రెండు గజాల దూరం” పాటించాలని, రానున్న రోజుల్లో మాస్కులు, ఫేస్‌ కవర్లు మన జీవితంలో భాగమైపోతాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో, వేగవంతమైన స్పందనే మన అందరి తప్పనిసరి లక్ష్యం కావాలని చెప్పారు.