రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. తొలుత శాసనసభ, శాసనమండలి నుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు.ఆ తర్వాత బిఎసి సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కోవిడ్‌ నేపథ్యంలో భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతాయని చెప్పారు. అసెంబ్లీ, మండలిలలోని ప్రతిసీటును శానిటైజ్‌ చేస్తున్నామని చెప్పారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేసి సభ్యులు మినహా ఎవర్ని అనుమతించకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. భౌతికదూరం పాటించి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పీకర్‌ వెల్లడించారు.