రేపే ‘మా’ ఎన్నికలు, కౌంటింగ్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల ఫలితాలు రేపు రాత్రికే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు వెల్లడించారు. అక్టోబర్‌ 10న జరగబోయే మా ఎన్నికల పోలింగ్‌ కోసం.. జూబ్లిహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారి నారాయణరావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులకు పోలింగ్‌ ప్రక్రియ గురించి ఆయన వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుందని.. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే అదేరోజు రాత్రి ఫలితాలు ప్రకటించే అవకాశముందని ఆయన వివరించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణుల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.