రైలు ప్రమాద ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు.  

‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర ఆవేదన కలిగించింది. దీనిపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం’ అని మోడీ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు రైల్వే ట్రాకుల మీదుగా తమ సొంత ప్రాంతాలకు వెళ్తూ ట్రాక్‌పై నిద్రిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

‘కొంతమంది వ్యక్తులు ట్రాక్‌ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.’ అని రైల్వే మంత్రి ట్వీట్ చేశారు.