వివాదాస్పద చిత్రాలు తీయటానికి అలవాటు పడ్డ రాం గోపాల్ వర్మ … ఆ వరుసలో తరువాత సినిమాగా ‘పవర్‌స్టార్’ టైటిల్ ప్రకటించాడు. ఆమేరకు ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలోని తారాగణం పికె, ఎంఎస్, ఎన్బి, టిఎస్, ఒక రష్యన్ భామ, నలుగురు పిల్లలు, ఎనిమిది గేదెలు అని పేర్కొన్నాడు. తరువాత పవన్ కల్యాణ్ రూపురేఖలతో ఉన్న ఈ చిత్రం హీరో ఫొటో కూడా విడుదల చేశాడు. గతంలోని చిత్రాల వలె ఇది కూడా వివాదాస్పదం కావొచ్చని సినీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈమధ్య వర్మ నెలకొక సినిమా ప్రకటిస్తున్నాడు. ప్రకటన వచ్చే సమయానికే చిత్ర నిర్మాణం కూడా ప్రారంభమై పోతోంది. కరోనా వైరస్, మర్డర్ పేరిట రెండు చిత్రాలను ఈ మధ్యనే ప్రకటించాడు. శనివారం ఆన్లైన్లో విడుదల చేసిన నగం చిత్రం బాడ్ రివ్యూలు తెచ్చుకుంది. అయినప్పటికీ ఆ మూవీ ద్వారా వర్మ భారీ లాభాలు పొందినట్టు సమాచారం. క్లైమాక్స్ మూవీకి రూ.100 వసూలు చేసిన వర్మ ఆ ధరను ఈ సినిమాకు మరో వంద పెంచాడు.
