ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. వీటితోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఉన్నత విద్యాకమిషన్ సవరణ బిల్లు, 2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది.
ఇదిలాఉండగా.. దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతోనే టీటీడీలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందని అన్నారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.