విజయవాడకు అచ్చెన్నాయుడు.. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో రెండు గంటల్లో విజయవాడకు తీసుకురానున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ సెంట్రల్‌ ఆఫీసుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ రికార్డు వర్క్‌ పూర్తైన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుచనున్నారు.ఒకవేళ కోర్టు సమయం ముగిసినట్లయితే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లనున్నారు. ఇక అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కాంలో పాత్రధారులుగా ఉన్న మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రదేశాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే