విశాఖలో రసాయన వాయువులు లీకేజీ, ఎనిమిది మంది మృతి… 86మందికి వెంటిలేటర్‌పై చికిత్స

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి రసాయన వాయువులు భారీగా లీకవుతున్నాయి. గురువారం వేకువ నుంచి రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. 86మంది బాధితులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.

“తెల్లవారుజామున ‘100’ నంబరు ద్వారా పోలీసులకు సమాచారం అందింది. తక్షణమే స్పందించిన పోలీసులు, సీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర జిల్లాల నుంచి అధికారులను, సిబ్బందిని, ఏపీఎస్పీ బలగాలను సంఘటన స్థలానికి పంపి బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఘటనపై వివరాలను ముఖ్యమంత్రికి వివరిస్తున్నాం” అని డీజీపీ వెల్లడించారు.