వ్యర్ధాల నిర్వహణకు ఆన్ లైన్ వేదిక

ఇక నుంచి వ్యర్థాల నిర్వహణ కోసం పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేదు. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్‌ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) వ్యర్థాల బదలాయింపునకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించనుంది. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్లాట్‌ఫామ్‌’ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.