వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్ ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు సోమవారం ప్రారంభమైంది.ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘14 నెలలపాటు నా పాదయాత్ర 3,648 కిలోమీటర్లు సాగింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించా. ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రతి లబ్దిదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నాం.లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ఉంచుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు వాలంటీర్ల వ్యవస్థలో 82 శాతం అవకాశం కల్పించాం. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అవినీతి లేని పారదర్శకత ఉన్న వ్యవస్థ.. గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గ్రామ సచివాలయాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతలకు నేరుగా ఇంటివద్దకే పెన్షన్ అందిస్తున్నాం. మత్స్యకార భరోసా, వాహనమిత్ర, వైఎస్ఆర్ భీమా పథకాలు తీసుకొచ్చాం. వాలంటీర్లు, ఆశావర్కర్ల వ్యవస్థ ద్వారానే కరోనాను నియంత్రణ చర్యలు చేపట్టాం. మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం.’ అని తెలిపారు.
