వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇది ఆరు నెలల క్రితం మొదలు పెట్టగా.. పెద్ద యెత్తున ప్రచారం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి అడ్వకేట్లకు వస్తున్న ఈ మెయిల్స్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ ఫోటోలతో కూడిన యాడ్స్ రావడం ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. ఈ మెయిల్స్‌లో ఆయన చిత్రాలు రావడాన్ని కొంత మంది సీనియర్ అడ్వకేట్లు ధ్రువీకరించారు. ఈ చర్య న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహకతను వేరు చేసే సన్నటి గీతను చెరిపేసినట్లు అయిందని అన్నారు. దీనిపై రిజిస్ట్రీ స్పందించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) .. అత్యున్నత న్యాయస్థానం తరుపున ఈ మెయిల్ సర్వీసు సేవలను అందిస్తుందని శుక్రవారం రాత్రి రిజీస్ట్రి ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఈ మెయిల్స్ ఫుటర్ల నుండి ఆ చిత్రాలను తొలగించాలని ఆదేశించింది.
