సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ఉత్తరాఖండ్‌కు చెందిన కేసులో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉద్యోగాలు, పదోన్న తుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సభ్యులు ఆందోళన చేశారు. ఈ అంశంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనలో స్పష్టత లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్‌, సిపిఎం, డిఎంకె, ఐయుఎంఎల్‌, రాజ్యసభలో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నోటీసులు ఇచ్చాయి. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అంశాన్ని లేవనెత్తి, చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.