స్టాలిన్‌కు మొరపెట్టుకున్న తెలుగు విద్యార్థి

దేశంలో వైద్య విద్యనభ్యసించేందుకు అర్హత పరీక్షైన నీట్‌ నిలిపివేతకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కృషి చేస్తున్నారు. నీట్ రద్దుపై ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేయగా.. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎస్‌ రవి తిరస్కరించారు. అయితే నీట్‌ పరీక్ష రద్దు కోరుతూ తమిళులు సైతం స్టాలిన్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. ఓ తెలుగు వ్యక్తి కూడా తమిళనాడు ముఖ్యమంత్రిని వేడుకోవడం గమనార్హం. స్టాలిన్‌ గురువారం కారులో అసెంబ్లీకి వెళుతుండగా.. రోడ్డుపై ఓ వ్యక్తి ‘ సిఎం సార్‌ .. హెల్ప్‌మీ’ అంటూ ఓ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నారు. అది చూసిన స్టాలిన్‌ అతనిని దగ్గరకు పిలిచి.. ఆరా తీశారు. తన పేరు సతీష్‌ అని, తాను తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తినని తెలిపారు. తనకు ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చినప్పటికీ.. నీట్‌ ప్రవేశ పరీక్ష కారణంగా ఎంబిబిఎస్‌ సీటు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు నీట్‌ పరీక్ష రద్దు కోసం కృషి చేస్తున్నందున.. మీతో తన మొర పెట్టుకుంటున్నానని, తనకు ఎంబిబిఎస్‌ సీటు ఇప్పించాలని కోరారు. సమస్య విన్న స్టాలిన్‌.. తప్పకుండా సాయం చేస్తానని భరోసానిచ్చారు.