హైదరాబాద్‌ పాతబస్తీలో టెన్షన్‌… టెన్షన్‌ – భారీ బందోబస్త్‌!

హైదరాబాద్‌ పాతబస్తీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాతబస్తీలో చార్మినార్‌ దగ్గరలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని, కెసిఆర్‌ కూడా రావాలని, ఫోర్జరీ సంతకం లేఖపై నిజాలు తేల్చుకుందామని సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపి బైక్‌ ర్యాలీని తలపెట్టింది. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. అయితే, బైక్‌ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఎలాగైన భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తానని బండి సంజయ్‌ చెప్పడంతో ఆ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సౌత్‌జోన్‌ సిపిపై భూపాల్‌ నేతృత్వంలో ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్‌, సౌత్‌జోన్‌ ఐడి పార్టీ, తెలంగాణ స్టేట్‌ బెటాలియన్‌, సిటిఆర్‌ఎం రిజర్వ్‌, అందుబాటులో ఉన్న రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. చార్మినార్‌, మదీనా గూడ, గుల్జార్‌హౌస్‌, శాలిబండ, హుస్సేన్‌ యాలం, మీరు చౌక్‌, ఫలక్నామ, ముర్గీ చౌక్‌ తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.