ఆర్థిక ఇబ్బందుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో అధికారం కోల్పోవడాన్ని బిజెపి ఇంకా జీర్ణించుకోలేకపోతుందని.. దీంతోఉద్దేశపూర్వకంగా నిధులను విడుదల చేయకుండా కుట్ర పన్నిందని మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవిఎ) కూటమి పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు బిజెపి యత్నిస్తోందని తెలిపింది. నిధులు విడుదల కాకపోతే అభివృద్థి పనులకు ఆటంకం ఏర్పడుతుందని.. దీంతో ప్రజల్లో ఎంవిఎ విశ్వాసం కోల్పోతుందని, ఎంవిఎపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమౌతుందని పేర్కొంది. ఇది అనైతికము, రాజ్యాంగ విరుద్ధమని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ అన్నారు. మహారాష్ట్ర బడ్జెట్‌ సెషన్‌ సోమవారం రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొష్యారీ ప్రసంగంతో ప్రారంభమైంది. గవర్నర్‌ అసెంబ్లీ భవనం చేరుకునే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు నినాదాలు చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి విడుదల కావలిసిన జిఎస్‌టి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయంటూ, జిఎస్‌టి బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ, రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంంటూ నినదించారు.