ఇంగ్లీష్‌ మీడియంపై సుప్రీం విచారణ

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనకు సంబంధించి జారీ చేసిన జీఓ నెంబర్‌ 81, 85ను హైకోర్టు రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ప్రతివాదులు అఫిడవిట్‌ దాఖలు చేసిన తరువాత స్టేపై పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కెవి విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. తెలుగు మీడియంలో చదవాలనుకుంటున్న వారి కోసం ఆ పాఠశాలలు కొనసాగించడమే కాకుండా, ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తారని పేర్కొన్నారు. 95 శాతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియంనే కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం లేకపోవడం వల్లే విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విద్యా బోధన సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే ఉండాలని రాజ్యాంగంలోని సెక్షన్‌ 29 చెబుతోంది కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది ”విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుగు మీడియం ఆప్షన్‌గా ఎంచుకోలేదు కాబట్టే, ఇంగ్లీష్‌ మీడియంపై నిర్ణయం తీసుకున్నాం. మాతృభాషకు ప్రాముఖ్యం ఇవ్వాలన్న రాజ్యాంగంలోనే సెక్షన్‌ 29(ఎఫ్‌)ను కూడా కచ్చితంగా పాటిస్తున్నాం. అన్ని సందర్భాలలోనూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యా హక్కు చట్టంలో ఎక్కడా చెప్పలేదు కాబట్టి, చట్టం, శాసనాల ఉల్లంఘన జరగలేదు” అని వివరించారు.