ఇండియాలో ఆరుగురిలో కొత్త కరోనా లక్షణాలు..!

జన్యు మార్పులు పొందిన కొత్త కరోనా వైరస్‌ ఇండియాలోకి ప్రవేశించింది. యూకే నుంచి భారత్‌ కు వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ సోకిన వారిని గుర్తించి, వారి నమూనాలను పరీక్షించగా, ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్‌ వచ్చినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త వైరస్‌ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్‌ తో దీన్ని నియంత్రించ వచ్చా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదని వైద్యాధికారులు తెలిపారు. ఇది ఎంత ప్రమాదకరమన్న విషయమై కూడా పూర్తి అవగాహనకు ఇంకా రాలేదని చెప్పారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23 మధ్య మొత్తం 33 వేల మందికి పైగా ప్రయాణీకులు బ్రిటన్‌ నుంచి వచ్చారని తెలిపారు. వారిలో 114 మందికి కరోనా నిర్థారణ అయిందని స్పష్టం చేశారు. కొత్త వైరస్‌ సోకిన వారిలో ముగ్గురిని బెంగళూరులోని నిమ్‌ హాన్స్‌ లో, ఇద్దరిని హైదరాబాద్‌ లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీలోనూ, ఒకరిని పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలోనూ ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. వీరందరినీ వేర్వేరు గదుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, వారికి దగ్గరగా మసలిన వారినందరినీ క్వారంటైన్‌ చేశామని, సహ ప్రయాణికులు, వారి కుటుంబీకులను ట్రేస్‌ చేస్తున్నామని వైద్యాధికారులు వివరించారు.