ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్‌ సెస్‌ రూపంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛార్జీల పెంపునకు సంబంధించి ఏపిఎస్‌ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఆర్టీసీ రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని వివరించారు. డీజిల్‌ రేటు దాదాపు 60 శాతం పెరిగిందని, రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ప్రస్తుతం నష్టాలను భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చిందని..తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్‌ ధరపై ఎలాంటి మార్పు చేయకుండా డీజిల్‌ సెస్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.