ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో వానలు కురస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల, రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరోవైపు బుధవారం ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ వానలు కురిశాయి. మరో రెండు రోజులు కూడా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణకు కూడా వాతావరణశాఖ రెండు రోజుల పాటూ వర్ష సూచన ఉందంటోంది. మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి మరియు వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.