ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ.. సంబంధిత పరిశ్రమల్లో ఏవైనా లోపాలు ఉంటే 30 రోజుల లోపే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. 90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.