కరోనాతో పెరుగుతున్న ఉద్యోగుల మరణాలు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇదే సందర్భంలో రాష్ట్ర సచివాలయం మొదలుకొని గ్రామ సచివాలయాల వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే కోవిడ్‌-19 భారిన పడుతున్నారు. కోవిడ్‌ రెండో దశ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఇటీవల పదుల సంఖ్యలో ఉద్యోగులు మరణించారు. రాష్ట్ర సచివాలయంలో పది రోజుల్లోనే ఐదుగురు ఉద్యోగులు కోవిడ్‌కు బలి అయ్యారు. దీంతో సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హామ్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పదేపదే విన్నవిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయడం లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇస్తారో లేదోననే సంశయం ఉద్యోగుల్లో నెలకొంది. ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించని పక్షంలో దీర్ఘకాల వ్యాధులున్న ఉద్యోగులు సెలవుపై వెళ్ళేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు భావిస్తున్నారు.