కరోనా కారణం చూపి ఎన్నికలు వాయిదా వేయలేం : సుప్రీం కోర్టు

 కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేయలేమని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో కరోనా పూర్తిగా పోయిన తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, అంతవరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇంకా నోటిఫికేషన్‌ కూడా వెలువడకముందే ఇటువంటి పిటిషన్‌ దాఖలు చేయడం తొందరపాటు చర్య అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ అవినాశ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం అత్యవసర సమయాల్లో ఎన్నికలు వాయిదా వేయొచ్చని వాదించారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని, సామాన్య ప్రజలతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపిలకు సైతం కరోనా సోకుతోందని తెలిపారు. వీటిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది.