కరోనా నిరోధక చర్యలపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో అపోహలను తొలగించి.. అవగాహన పెంచాలని అధికారులకు ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, ఇళ్ల పట్టాల పంపిణీపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాపై తప్పుడు సమాచారం వ్యాపింప చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దుకాణాలు అన్ని అందుబాటులో ఉంటాయని.. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాదని సీఎం స్పష్టం చేశారు. కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని.. గ్రామ సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.