కరోనా పై సీఎం జగన్ సమీక్ష

కోవిడ్‌-19 పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, కోవిడ్‌-19 ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.

ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలని, నిరంతరం ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలని చెప్పారు. కాల్‌ సెంటర్‌లతో పాటు ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.