కరోనా వైరస్‌ ఇప్పట్లో పోదు : డబ్ల్యుహెచ్‌ఒ

వైరస్‌ ఆధీనంలో మనం ఉన్నాం అని కానీ, వైరస్‌ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించవద్దని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆగేసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనమ్‌ ఖత్రేపాల్‌ సింగ్‌ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. కానీ, ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్‌ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న వారిలో యాంటీ బాడీలు ఉత్పన్నమై.. వైరస్‌ బారిన పడే తీవ్రత తక్కువగా ఉంటుందని అన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందనే వార్తలపై పూనమ్‌ ఖత్రేపాల్‌ సింగ్‌ స్పందించారు. అది ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనందరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వైరస్‌ ఎక్కువ మందికి సోకే అవకాశం లేదని తెలిపారు.