కర్నాటకలో తొలిదశ పోలింగ్‌ ప్రారంభం

కర్నాటక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్‌ కొనసాగనుండగా.. రెండోదశ పోలింగ్‌ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని 5,700 గ్రామ పంచాయతీలకు జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో 6,004 గ్రామ పంచాయతీలు ఉండగా 300 పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. తొలిదశలో 3 వేల గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఈ ఎన్నికల్లో 92 వేల మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.