కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ కరోనాతో మృతి

మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ (81) కరోనాతో మరణించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ముంబైలోని కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కూతురు వర్షా గైక్వాడ్‌ ప్రస్తుతం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ ముంబయి సౌత్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపిగా గెలుపొందారు. దేశంలోనే అతిపెద్ద మురికివాడ ఉన్న ముంబయిలోని ధారావి అసెంబ్లీకి 1985 నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ముంబయి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ మరణం పట్ల పలువురు నేతలు సతాపం తెలిపారు.