కేరళ కమ్యూనిస్టు నేత కె.ఆర్‌ గౌరీ అమ్మ కన్నుమూత

కేరళ తొలి రెవెన్యూ మంత్రి, కమ్యూనిస్టు నేత కె. ఆర్‌ గౌరీ అమ్మ (102) మంగళవారం ఉదయం కన్నుమూశారు. వయో సంబంధింత సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అలప్పుజ జిల్లాలోని చెర్తాలాలో ఆమె జన్మించారు. కేరళ తొలి ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరించారు. కార్మిక, కర్షక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గనేవారు. అనేక సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లారు. 1952లో ట్రావెన్‌కోర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1954లో మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. 1957, 1967, 1980, 1987 సంవత్సరాల్లో కేరళలో వామపక్ష నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 1957లో భూసంస్కరణ బిల్లును ప్రవేశపెట్టారు. 1987లో మహిళా కమిషన్‌ బిల్లు రూపకల్పనలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కేరళ రాజకీయల్లో ఎక్కువ కాలం కొనసాగిన అమ్మ…యుక్త వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.