కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

కేసీఆర్‌.. నువ్వేమైనా ఎర్రవల్లికి సర్పంచ్‌వా? చింతమడకు ఎంపీటీసీవా? ఆ రెండు గ్రామాల ప్రజల కోసమే పనిచేస్తావా? మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉన్న ఎర్రవల్లి గ్రామస్థులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారని, ఆయన సొంతూరు చింతమడకలో కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. వీటికి కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం నుంచి రోజూ ఒక నియోజకర్గంలో ‘పట్నం గోస’ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. 20 జిల్లాల్లో ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కూడా ఇవ్వలేదన్నారు. ప్రగతి భవన్‌ను ఏడాదిలోపే నిర్మించుకున్న కేసీఆర్‌ ఐదేళ్లు కావస్తున్నా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో 128 ఇళ్లు మాత్రమే కట్టించారని తెలిపారు.