కొత్త హెయిర్‌ స్టైల్‌.. కొత్త లుక్‌తో మహేశ్‌ బాబు!

టాలీవుడ్‌ హీటో మహేశ్‌ బాబు కొత్త హెయిర్‌ స్టైల్‌తో కొత్త లుక్‌లో అదరగొడుతున్నాడు. మహేష్‌ బాబుకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆయన భార్య నమ్రతా ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన మహేశ్‌ బాబు కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ”తెల్లవారుజామున 3 గంటలకు విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్‌ బాబు” అనే క్యాప్షన్‌తో ఆమె ఈ ఫొటోను పోస్ట్‌ చేసింది. కొత్త హెయిర్‌ స్టైల్‌లో మహేశ్‌ బాబు చాలా యంగ్‌గా కనపడుతోన్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా, యంగ్‌గా కనపడుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్వరలో మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్‌ విజృంభణ వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న మహేశ్‌ బాబు మళ్లీ ఓ యాడ్‌ రూపంలో ఇటీవలే కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా టూర్‌కి వెళ్లి ఎంజారు చేశాడు.