కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష
కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు.. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి పలువురు విమానాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వారికి అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేయిస్తామని.. అనంతరం మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌ చేసి పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. ‘‘ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వండి. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించండి. తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే… వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదు. చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సహాయం చేయండి. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు రూపాయలు ఒక్కో కూలీకి ఇవ్వండి’’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.