క్షమాపణ చెప్పేదిలేదన్న ప్రశాంత్‌ భూషణ్‌

 తాను దృఢంగా నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా చేసిన ట్వీట్లకు నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పినట్లైతే అది కోర్టు ధిక్కరణతోపాటు తన మనస్సాక్షిని కూడా ధిక్కరించినట్లవుతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా భావిస్తూ ఆయనను దోషిగా తేల్చి, బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సోమవారం వరకూ కోర్టు గడువిచ్చింది. దీనిపై తన ట్వీట్లను సమర్ధించుకుంటూ ప్రశాంత్‌భూషణ్‌ అఫిడవిట్‌ సమర్పించారు. క్షమాభిక్ష కోరనని, కోర్టు ఏ శిక్ష విధించినా ఆమోదిస్తానని మహాత్మాగాంధీ అన్న మాటలను అందులో ఉటంకించారు. క్షమాపణ నిజాయితీతో చెప్పాలని, ఏవో మాటలు పలకడం కాదని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆశాకిరణంగా కనిపించేది సుప్రీంకోర్టేనని నమ్ముతానని పేర్కొన్నారు.