తొలి డోసు టీకా తీసుకున్నా…’మహా‘ ముఖ్యమంత్రి భార్యకు కరోనా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే భార్య రష్మీ ధాకరే కరోనా బారిన పడ్డారు. ఈ నెల 11న జెజె ఆసుపత్రిలో ముఖ్యమంత్రి, ఆయన భార్య కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న సంగతి విదితమే. అయినప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. సోమవారం రాత్రి కోవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలిందని..ప్రస్తుతం అధికారిక నివాసంలో క్వారెంటైన్‌లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక మంత్రి, ఉద్దవ్‌ కుమారుడు ఆదిత్య థాకరేకు కరోనా వచ్చిన సంగతి విదితమే. కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మంగళవారం 28,699 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కు చేరుకున్నాయి. 24 గంటల్లో 132 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 22, 47, 495 మంది కోలుకోగా..2,30,641 యాక్టివ్‌ కేసులున్నాయి.