దేశంలో 10 వేలకు తగ్గిన కరోనా కేసులు

దేశంలో తాజాగా కరోనా కేసులు 10 వేలకు తగ్గాయి. రికవరీ రేటు కూడా 98.23 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం… దేశంలో కోవిడ్‌ కేసులు ముందురోజు కంటే 14 శాతం మేర తగ్గి..10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా, 10,929 కొత్త కేసులు వెలుగుచూశాయి. 392 మరణాలు నమోదయ్యాయి.

తగ్గిన రికవరీ రేటు.. క్రియాశీల రేటు..
దేశవ్యాప్తంగా కోవిడ్‌ రికవరీ రేటు, క్రియాశీల రేటు తగ్గింది. గత ఏడాది ప్రారంభం నుంచి 3.43 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. నిన్న 12,509 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.23 శాతంగా కొనసాగుతోంది. గత కొద్ది కాలంగా క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 1,46,950 మంది కోవిడ్‌ వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.43 శాతానికి తగ్గింది.

314 మరణాలు కేరళాలోనివే..
కొద్ది రోజులుగా కేరళ కరోనా మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది. ప్రస్తుతం 392 కోవిడ్‌ మరణాలు నమోదుకాగా.. అందులో 314 మరణాలు కేరళలోనివే. మొత్తంగా నాలుగు లక్షల 60 వేల మంది కరోనాతో మృతి చెందారు.