నామినేషన్ల తిరస్కరణపై ఎపి హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఒ) మరిచిపోయారంటూ ఎపి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన కారణాలు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌లో టిడిపి తరఫున బరిలో దిగిన జి.మహేంద్రబాబు నామినేషన్‌ను ఆర్‌ఒ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డుకు బరిలో ఉన్న షేక్‌ జాఫర్‌ అలీ తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కేఎం కఅష్ణారెడ్డి, ఎన్‌.అశ్వనీకుమార్‌, కంభంపాటి రమేశ్‌బాబు తదితరులు వాదనలు వినిపించారు. ఆర్‌ఒలు అవకతవకలకు పాల్పడుతూ నామినేషన్లు తిరస్కరించారన్నారు. వారు దురుద్దేశంతో వ్యవహరించారని పేర్కొన్నారు.