నేడు సీఎం లతో మోడీ చర్చలు
నేడు సీఎం లతో మోడీ చర్చలు

నేడు సీఎం లతో మోడీ చర్చలు

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్న అంశంపై ప్రధాని మోదీ శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశం అనంతరమే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహా, సూచనలను తీసుకోనున్నారు.

అయితే పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగింపునకు మద్దతు తెలిపిన నేపథ్యంలో తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చునని అంచనా. పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా ఒకడుగు ముందుకేసి ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్‌డౌన్‌ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు.