నేను ప్రజా బాణాన్ని..ఖమ్మం సభలో షర్మిల

‘టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పంపితే మేం రావడం లేదు. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజాబాణమై వస్తున్నా. సింహం సింగిల్‌గానే వస్తుంది. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా, రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా’ అని షర్మిల అన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా శుక్రవారం సాయంత్రం బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసం గించారు. ఖమ్మంలోని పెవిలియన్‌ మైదానంలో జరిగిన భారీ సభలో ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు పదేపదే చెప్పారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలు, ప్రబలుతున్న నిరుద్యోగంతో పాటు వివిధ అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు తీరలేదని అన్నారు. కెజి టు పిజి ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. వీటిని నిలదీయాల్సిన ప్రతిపక్షం కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌కు నాయకులని పంపే కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు. మతోన్మాదం తప్ప బిజెకికి మరేమి పట్టదని, దేనిపైనా మాట్లాడదని అన్నారు. తెలంగాణకు చేసిందేమి లేదు కాబట్టే మతాన్ని బిజెపి ముందుకు తెస్తోందన్నారు. ‘పసుపుబోర్డు ఇస్తామన్నారుగా ఎందుకు ఇవ్వడం లేదు’ అని అన్నారు.