పండుగల కన్నా ప్రాణాలు విలువైనవి

 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  బాణాసంచా  నిషేధంలో తాము జోక్యం చేసుకోబోమంటూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్‌లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుర్రాబజార్‌ ఫైర్‌వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌, గౌతమ్‌ రాయ్  ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ సింగ్‌ ధర్మాసనం నిరాకరించింది. పండుగలు ముఖ్యమే.. అయితే ప్రాణాలను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమని పేర్కొంది. ప్రతి కుటుంబంలోనూ పెద్ద వాళ్లు, వృద్ధులు ఉన్నారని, వారిపట్ల జాగ్రత్తలు తీసుకోవడం కూడా అత్యవసరమేనని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసిరావాలని ధర్మాసనం పేర్కొంది. స్థానిక పరిస్థితుల గురించి హైకోర్టుకు తెలుస్తుందని, ప్రజలకు ఏది అవసరమో అదే హైకోర్టు వెల్లడిస్తుందని  పేర్కొంది.