‘పెగాసస్‌’ పై సభా కమిటీ : స్పీకర్‌ ప్రకటన

కొద్దినెలల క్రితం జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన పెగాసస్‌ స్ఫైవేర్‌ అంశం తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు వచ్చింది. స్పైవేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన ప్రకటనపై అధికార వైసిపి సభ్యులు ఉభయసభల్లోనూ విచారణకు డిమాండ్‌ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు తమను సంప్రదించింది నిజమేకానీ, తాము కొనుగోలు చేయలేదని అప్పటి ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. వీరిరువురి ప్రకటనలతో విదేశాలకు చెందిన పెగాసస్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్పైవేర్‌ను అమ్మడానికి ప్రయత్నించారని స్పష్టమౌతోంది. అయితే, ఎవరి అంగీకారంతో ఆ సంస్థ ప్రతినిధులు ఈ మంతనాలు సాగించారు? దేశ భద్రతతో ముడిపడిఉన్న ఈ లావాదేవీలకు కేంద్రం అనుమతిచ్చిందా? వంటి విషయాలు వెలుగులోకి రావాల్సిఉంది. అత్యంత కీలమైన ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు బిజెపి నేతలూ మౌనం వహిస్తున్నారు. వైసిపి,టిడిపి సభ్యులు పరస్పరం దుమ్మెతిపోసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.