ప్రయివేట్‌ వర్శిటీల్లో 50శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ: జగన్‌

 ప్రయివేటు వర్శిటీల్లో 50శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద కేటాయించాలని, కన్వీనర్‌ కోటాలో పేదపిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే చేస్తుందని సిఎం తెలిపారు. ఉన్నత విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై సిఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు చేశారు. ఆన్‌లైన్‌ తరగతుల విధానంపై మరింత దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే విద్యాసంవత్సరం ఆలస్యమైందని విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సిఎం సూచించారు. అలాగే ప్రయివేటు యూనివర్సిటీల్లో ప్రమాణాలపై సమావేశంలో చర్చించారు. ప్రయివేటు యూనివర్శిటీలకు ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ, న్యాక్‌ గుర్తింపు కూడా ఉండాలని నిర్ణయించారు.