బాపు మ్యూజియంను ప్రారంభించిన సిఎం జగన్‌

విజయవాడ బందరు రోడ్డులో ఉన్న విక్టోరియా మెమోరియల్‌ భవన ప్రాంగణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించిన బాపు మ్యూజియంను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. రూ.8 కోట్లతో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. తొలుత ప్రాంగణానికి చేరుకున్న సిఎం జగన్‌.. విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. ఆదిమానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళా సంపదతోపాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆదిమానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మానవుడి వరకు వారు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి, తదితరాలను భద్రపరిచారు.