భారత్‌-పాక్‌ల మధ్య మళ్లీ చిగురించనున్న సంబంధాలు..!

భారత్‌-పాక్‌ల మధ్య సంబంధాలు మళ్లీ చిగురించున్నాయి. ఈ దిశగా పాక్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్‌ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత ప్రభుత్వంతో ఇమ్రాన్‌ సర్కార్‌ చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌ నుండి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవడంపై పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ నిర్ణయించబోతోందని అనధికారిక సమాచారం. కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనుందని తెలుస్తోంది. జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును చేసి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోడీ సర్కార్‌ మార్చిన తర్వాత.. భారత్‌తో పాకిస్తాన్‌ అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది. కాగా, పాకిస్తాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్‌కు ప్రధాని మోడీ… లేఖ రాసిన తర్వాత… ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.