మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదా?

మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ మూడో తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో 28 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ బిజెపి సీట్లు ఇచ్చింది. దీంతో ఈ సీట్లలో ఇప్పటి వరకు ఉన్న బిజెపి నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్‌ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని వీరు బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరు సీట్లలో బిజెపి నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ టిక్కెట్‌ పైనా లేదా సమాజ్‌వాది పార్టీ టిక్కెట్‌ పైనో పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల అసంతృప్తికి గురైన బిజెపి నేతలు ఇండిపెండింట్‌గా పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటివరకు ప్రత్యర్దులుగా ఉన్న సింధియా గ్రూపు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయలేక స్థానిక బిజెపి నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కొన్ని చోట్ల బిజెపి కార్యకర్తలు ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గనకుండా మౌనంగా ఉండిపోయారు.