మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ

కరోనా వైరస్‌పై పోరులో భారత ప్రజల సేవా శక్తి కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దేశంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు పున: ప్రారంభమయ్యాయని చెప్పారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, మీడియా ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేశారని కొనియాడారు. కరోనాకు సంబంధించి భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు.కరోనాపై విజయం సాధించడానికి మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతోపాటుగా.. మాస్క్‌లు ధరించాలని కోరారు. కరోనా సమయంలో ఎందరో కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారని చెప్పారు. విద్యా రంగంలో ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయని.. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల కోసం సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా సమయంలో పేదలు, కూలీల పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేనివని అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీల కోసం శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నామని గుర్తుచేశారు. ఆత్మ నిర్భర్‌ కార్యక్రమంతో దేశం ఉన్నతస్థితికి చేరుతుందన్నారు. దేశంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన సామర్థ్యం మేరకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. కరోనాపై పోరు సుదీర్ఘమైనదని చెప్పారు.