మలేసియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష

మ‌లేషియా డెవ‌ల‌ప్‌మెంట్ బెర్హాద్‌(వ‌న్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మ‌లేషియా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్‌లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వ‌ర‌కు న‌జీబ్ మ‌లేషియా ప్ర‌ధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్‌, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి.

కాగా.. మలేషియాలో ఎన్‌ఆర్‌సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధానికే ఉంటుంది. ఈ కుంభకోణం కూడా ఆయన హయాంలోనే జరగడంతో పాటు, ఢిఫెన్స్‌ వాదనలు కూడా ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించేలా లేవని హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు నజీబ్‌పై అభియోగాలు రుజువు కావడంతో కౌలాలంపూర్‌ హైకోర్టు ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.