మాకివ్వాల్సిన ఆక్సిజన్‌ను కేంద్రం ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తోంది

పశ్చిమ బెంగాల్‌కు మరింత ఆక్సిజన్‌ అందించాలంటూ ప్రధాని మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, దీంతో ఆక్సిజన్‌ అవసరం పెరుగుతోందని.. అటువంటి సమయంలో తమ సరఫరాను కేంద్రం ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తోందని విమర్శించారు. గత వారం నుండి రాష్ట్రంలో ఆక్సిజన్‌ వినియోగం ప్రతి రోజూ 470 టన్నుల నుండి …550 టన్నుల వరకు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు రోజుకు 550 టన్నుల ఆక్సిజన్‌ అవసరమని కేంద్రానికి ఇప్పటికే తెలియజేశామని అన్నారు. మా రాష్ట్రానికి అవసరమైన, తమకు కేటాయించాల్సిన ఆక్సిజన్‌ను కేంద్రం ఇతర రాష్ట్రాలకు అందజేస్తోందని అన్నారు. గత పది రోజుల్లో రోజుకు 550 టన్నుల చొప్పున ఆక్సిజన్‌ అవసరముండగా…చాలా తక్కువ ఆక్సిజన్‌ను మాత్రమే అందించినట్లు తెలిపారు.