ముఖ్యమంత్రిగా అల్లు అర్జున్‌ మెప్పించగలడా?

ఎపి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆధారంగా చేసుకొని ‘యాత్ర’ అనే టైటిల్‌తో సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవ్‌ గుర్తుందా? గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు పొలిటికల్‌ నేపథ్యంలో వచ్చిన యాత్రతో సినిమా రాజశేఖర్‌ రెడ్డి అభిమానులు, తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అయితే రాఘవ్‌ మరోసారి పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలోనే సినిమా తీయబోతున్నాడట! అల్లు అర్జున్‌ తన తరువాత ప్రాజెక్ట్‌ రాఘవ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన సినిమాకు సంబంధించిన స్టోరీలైన్‌ను అల్లు అర్జున్‌కు వినిపించాడట! స్టోరీ లైన్‌ నచ్చిన బన్నీ కంప్లీట్‌ స్క్రిప్ట్‌ రెడీ చేయమని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా మహి వి రాఘవ్‌ ఈ స్టోరీని ఎపి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని హీరో పాత్ర డిజైన్‌ చేశారని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా సిఎంగా ప్రజాసంక్షేమానికి పాటు పడే ఆ క్యారక్టర్‌కి కమర్షియాలిటీ జోడించి రూపొందించబోతున్నారట. అల్లు అర్జున్‌ ఇప్పటి వరకు మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. సెటిల్డ్‌ పెర్ఫార్మన్స్‌ పాత్రలు పోషించలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే బన్నీకి కూడా ఇదో ఛాలెంజింగ్‌ రోల్‌ అవుతుంది. గతంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘ఒకే ఒక్కడు’, దగ్గుబాటి రానా ‘లీడర్‌’, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమాలలో ముఖ్యమంత్రి పాత్రలలో నటించి మెప్పించారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.